సాహసయాత్ర: ఒంటి కాలితో సైకిల్‌ మీద 3,700 కిమీ

27 Jul, 2021 12:19 IST|Sakshi

ఒంటి కాలిపై సైకిల్‌ తొక్కుతూ 3700 కిమీ ప్రయాణం చేసిన వ్యక్తి

ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్‌ పాస్‌ ఖార్డంగ్‌ లా చేరడమే లక్ష్యం

తిరువనంతపురం: మన మీద మనకు నమ్మకం.. గట్టి సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి పోరాడవచ్చు. సాధించాలనే తపన నీకుంటే.. విధి సైతం నీ ముందు తలవంచి తప్పుకుంటుంది అంటారు కార్య సాధకులు. ఈ మాటలను నిజం చేసి చూపాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పక్షవాతం వచ్చి కుడి కాలు చచ్చు బడింది. దాంతో ఉద్యోగం కోల్పోయాడు. అయినా అతడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంగ వైకల్యాన్ని పక్కకు పెట్టి.. ఒంటి కాలితో సైకిల్‌ తొక్కుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లా చేరాలని భావించాడు. లద్ధాఖ్‌ నుంచి మొదలు పెట్టి 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంగ వైకల్యం అతడికి అడ్డంకిగా మారలేదు. అతడి ప్రయాణం.. పయనం ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. 

కేరళ, త్రిసూర్‌కు చెందిన మహ్మద్‌ అశ్రఫ్‌ కొన్నేళ్లుగా దుబాయ్‌లో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూండేవాడు. సాపీగా సాగిపోతున్న అతడి జీవితంలో 2017లో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. పెద్ద ప్రమాదానికి గురయ్యాడు మహ్మద్‌.. ఫలితంగా పక్షవాతం వచ్చి అతడి కుడి కాలు పడిపోయింది. దాంతో ఉద్యోగం నుంచి తొలగించారు. 

ఈ సందర్భంగా మహ్మద్‌ మాట్లాడుతూ.. ‘‘2017లో బైక్‌ యాక్సిడెంట్‌ అయ్యింది. 9 ఆపరేషన్‌లు చేశారు. ఏళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీటన్నింటిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. డిప్రెషన్‌ నుంచి బయటపడటం కోసం గతేడాది, ఏప్రిల్‌లో పర్వతాలు ఎక్కడం ప్రారంభించాను. దాంతో నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. పర్వతారోహణతో ప్రేమలో పడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. 

‘‘ఈ ప్రయాణంలో నా లోపమే నా సామర్థ్యం అని తెలిసి వచ్చింది. దాంతో మనిషి తల్చుకుంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాలనుకున్నాను. నేను కుంగిపోయి ఉంటే.. మంచానికే పరిమితం అయి ఉండేవాడిని. కానీ నేను అలా ఉండాలని కోరుకోలేదు. సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలనుకున్నాను. అందుకే ఈ సాహసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు. 

‘‘17,582 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లాను సైకిల్‌ మీద చేరుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి 11 రాష్ట్రాలు దాటాను. రోజుకు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు ఓ మడతపెట్టగలిగే ఓ టెంట్‌, నిద్ర పోవడానికి ఉపయోగించే ఓ బ్యాగ్‌ తీసుకుని జర్నీ ప్రారంభించాను. రాత్రి పూట పెట్రోల్‌ బంకుల్లో నిద్రపోయేవాడిని’’ అని తెలిపారు. 

‘‘ఈ ప్రయాణంలో నాకు ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. 1000 కిలోమీటర్లు ప్రయాణించి త్రిసూర్‌ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నాను. నా ప్రయాణం గురించి తెలిసి నాకు ఆహారం, బస ఏర్పాటు చేశారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటాను’’ అన్నాడు. 

కృత్రిమ కాలు అమర్చుకోవచ్చు కదా అంటే.. ‘‘మూడేళ్లు ఆస్పత్రిలో ఉండే సరికి నా కుటుంబం పొదుపు చేసిన మొత్తం ఖర్చయ్యింది. ఈ టూర్‌ పూర్తయ్యాక డబ్బులు పోగేసి.. సర్జరీ చేయించుకుని.. కృత్రిమ కాలు పెట్టించుకుంటాను’’ అని తెలిపాడు మహ్మద్‌. 

మరిన్ని వార్తలు