తీరని విషాదం: 15 రోజుల్లో డెలివరీ, అంతలోనే

8 Aug, 2020 18:05 IST|Sakshi

లక్నో/తిరువనంతపురం: కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ‘ఇప్పుడే ల్యాండ్‌ అయ్యాం’ అని తమవారి నుంచి కబురు బదులు, వారి చావు వార్త వినాల్సి వచ్చింది. అయితే, విమాన ప్రమాదంలో మృతి చెందిన కో-పైలట్‌ అఖిలేష్‌ శర్మ (32) కుటుంబానికి మాత్రం పగవాడికీ రాని పరిస్థితి ఎదురైంది. మృతుడు అఖిలేష్‌ భార్య మేఘ (29) నెలలు నిండిన గర్భిణి కావడమే దీనికి కారణం. మరో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో భర్త మరణవార్తను కుటుంబ సభ్యులు ఆమెకు తెలియనివ్వలేదు. అఖిలేష్‌ ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడని మాత్రమే చెప్పామని అతని సోదరుడు లోకేష్‌ శర్మ తెలిపాడు. 
అతను మాట్లాడుతూ.. ‘కోళీకోడ్‌లో విమాన ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న అన్నయ్య అఖిలేష్‌కు గాయాలు అయ్యాయని తొలుత సమాచారం అందింది. రాత్రి పొద్దుపోయాక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. మా వదిన నిండుగర్భిణి అవడంతో ఈ విషయం ఆమెకు చెప్పలేదు. విమాన ప్రమాదంలో అన్నయ్య గాడపడ్డారని, ఆస్పత్రిలో కోలుకుంటున్నారని చెప్పాం. మరో అన్నయ్య భువనేష్‌, బావమరిది సంజీవ్‌ శర్మ కోళీకోడ్‌కు బయల్దేరి వెళ్లారు’అని లోకేష్‌ పేర్కొన్నాడు. కాగా, 2017లో అఖిలేష్‌ పైలట్‌గా విధుల్లో చేరాడు. మేఘాతో అతనికి 2018 లో వివాహమైంది. వారి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో నివాసం ఉంటోంది. ఇక శుక్రవారం సాయంత్రం జరిగిన కేరళ విమాన ప్రమాదంలో పైలట్‌, కో-పైలట్‌తో సహా 21 మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 50 మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు