విద్యార్థి ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే.. ఆడియో క్లిప్‌ వైరల్‌

5 Jul, 2021 15:38 IST|Sakshi
నటుడు, కొల్లాం ఎమ్మెల్యే ఎం. ముఖేష్‌ (ఫైల్‌ ఫోటో)

క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ముఖేష్‌

తిరువనంతపురం: సాయం చేయాల్సిందిగా కోరుతూ ఓ పదవ తరగతి విద్యార్థి తన నియోజకర్గ ఎమ్మెల్యేకు కాల్‌ చేశాడు. సాయం సంగతి దేవుడేరుగు.. కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు. ‘‘నా నంబర్‌ ఎవరు ఇచ్చారు.. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ ఎమ్మెల్యే. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు.. 

కేరళ, కొల్లాం  సీపీఐ (ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌కు రెండు రోజుల క్రితం అతడి నియోజకవర్గానికి చెందిన ఓ పదవి తరగతి విద్యార్థి కాల్‌ చేశాడు. తను ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చెప్పి.. ఎమ్మెల్యేను సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్‌ నీకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నానని చెప్పగా.. ముఖేష్‌ ఆగ్రహంతో ‘‘నీ స్నేహితుడి ముఖం పగలకొట్టాలి.. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్‌ తీసుకుని నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ దురుసుగా మాట్లాడాడు. 

విద్యార్థి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనకు భయపడిన సదరు విద్యార్థి తప్పయ్యింది సార్‌.. క్షమించండి అని కోరాడు. కానీ ముఖేష్‌ విద్యార్థి మాటలు వినకుండా.. అతడిపై మండి పడ్డాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎమ్మెల్యే ముఖేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ముఖేష్‌ దీనిపై వివరణ ఇస్తూ.. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. దీనిలో ముఖేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాకు అవిరామంగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. గంటలో నా ఫోన్‌ చార్జింగ్‌ అయిపోతుంది. ఎవరేవరో నాకు కాల్‌ చేసి.. మా ఏరియాలో కరెంట్‌ లేదు.. రైళ్లు ఎందుకు సక్రమంగా తిరగడంలేదని.. ఏవేవో ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.. ప్లాన్‌ ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా కాల్‌ చేస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం లభించలేదు. ఇక ఆ రోజు కూడా నేను జూమ్‌ మీటింగ్‌లో ఉండగా ఓ విద్యార్థి నాకు కాల్‌ చేసి ఇలానే మాట్లాడాడు. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను. ఆ విద్యార్థి నాకు కాల్‌ చేస్తూనే ఉన్నాడు. సమావేశం డిస్టర్బ్‌ అయ్యింది. ఆ కోపం, విసుగులోనే నేను సదరు విద్యార్థిని కోడతాను అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని’’ ఎమ్మెల్యే ముఖేష్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు