సారా రక్కసిపై గ్రామస్తుల ఉక్కుపాదం: పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

4 Sep, 2021 14:21 IST|Sakshi
జయపురం: కొట్‌పాడ్‌ పోలీస్‌స్టేషన్‌ని ముట్టడించిన మహిళలు

సారా అమ్మకాలు ఆపాలని కొట్‌పాడ్‌ పంచాయతీ మహిళల డిమాండ్‌ 

జయపురం: సారా తయారీ, విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఒడిశాలోని జయపురం జిల్లా కొట్‌పాడ్‌ పంచాయతీకి చెందిన మహిళలు అదే పంచాయతీలోని పోలీస్‌స్టేషన్‌ని శుక్రవారం ముట్టడించారు. అంతకుముందు వీరంతా అబ్కారీ కార్యాలయానికి వెళ్లి, ఆందోళన చేసేందుకు ప్రయత్రించగా అక్కడ కార్యాలయానికి తాళం వేసి ఉంది. దీంతో మళ్లీ వారంతా అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కి చేరుకుని, నిరసన చేపట్టారు.

చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్‌!

తమ ప్రాంతాల్లో జోరుగా విదేశీ మద్యం, సారా ప్యాకెట్ల విక్రయాలు సాగుతున్నాయని, దీంతో తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ పంచాయతీలోని సారా దుకాణాలను బంద్‌ చేయకపోతే రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతీ గ్రామంలో సారా విక్రయాలు కొనసాగడంతో విద్యార్థులు కూడా తాగుడుకి బానిసలవుతున్నారని, తద్వారా వారి బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన కొట్‌పాడ్‌ పోలీస్‌ అధికారి సారా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన నిరసనకారులు ఇంటిబాట పట్టారు.

కలెక్టర్‌కి సర్పంచ్‌ల వినతిపత్రం.. 
కొరాపుట్‌: బంధుగాం, నారాయణ పట్నం సమితుల్లో సారా బట్టీలు నిర్మించొద్దని 13 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై వీరంతా శుక్రవారం కలెక్టరేట్‌కి చేరుకుని, కలెక్టర్‌ పేరిట రాసిన వినతిపత్రాన్ని అక్కడి ఓ అధికారికి అందజేశారు. ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసే సారాబట్టీలతో యువత, ఇంటి పెద్దలు తాగుడుకి బానిసవుతున్నారని, దీంతో ఇంట్లో వారి మధ్య సఖ్యత కొరవడుతోందన్నారు. దీంతో పాటు గ్రామాల్లో తాగుబోతుల గొడవలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో సారాబట్టీల నిర్వహణ వద్దని కోరారు.

చదవండి: అప్పటికి మూడో వేవ్‌ ముగుస్తుంది: సుప్రీంకోర్టు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు