ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం

12 Oct, 2021 15:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య మంగళవారం జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్‌ను అమలు చేయనున్నట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది.

ఈ మేరకు మంగళవారం ఏపీ ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకపోతే మాకు అంగీకారం కాదని చెప్పాము. శ్రీశైలం, సాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏపీ ఆమోదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ ఇస్తుందో లేదో మాకు తెలియదు. మిగతా విషయాలు బోర్డు చూసుకోవాలి. రెండు మూడు నెలలు సంధికాలం ఉంటుంది' అని ఏపీ ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామలారావు అన్నారు. 

తెలంగాణ ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడుతూ.. '65 కేంద్రాలు గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్‌నోటిఫికేషన్‌ ఆపాలని కోరాం. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరింది, మేము అంగీకరించలేదు. మాకు విద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పాం. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా అడిగాం' అని తెలంగాణ ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. 

చదవండి: (తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ) 

మరిన్ని వార్తలు