‘నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చారు’

7 Aug, 2020 20:47 IST|Sakshi

లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో దారుణం

భోపాల్‌: స్టాల్‌ ఏర్పాటు విషయంలో పోలీసులకు, ఓ సిక్కు వ్యక్తికి మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో నడిరోడ్డు మీద ఆ సిక్కు వ్యక్తి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఖాకీల తీరు పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బర్వానీలోని రాజ్‌పూర్ తహసీల్‌లో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని జియానీ ప్రేమ్‌ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. బాధితుడు ఈ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని భావించాడు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో జియానీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అతడి జుట్టు పట్టుకుని ఈడ్చారు. జియానీని కాపాడ్డానికి వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అవతలకు లాగి పడేశారు. (రూ. 100 ఇవ్వనందుకు.. అయ్యో పాపం!)

ఈ క్రమంలో పోలీసులు తనను ఈడ్చుకెళ్తుండగా.. ‘వీళ్లు నన్ను​ కొడుతున్నారు. మమ్మల్ని చంపేస్తారు. పోలీసులు మా జుట్టు పట్టుకుని ఈడుస్తున్నారు. మేం స్టాల్‌ పెట్టుకోవడానికి వారు అంగీకరించడం లేదు’ అంటూ అరుస్తూ.. తమను కాపాడాల్సిందిగా చుట్టూ ఉన్న జనాలను కోరాడు జియానీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు జియానీ తాగి ఉన్నడు. పోలీసులను అడ్డుకున్నాడు’ అని తెలిపారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. (చూస్తే పిచ్చోళ్లే.. కానీ అతి కిరాతకులు!)

ఈ ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి నరేంద్ర సలుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధితుడు గత కొంతకాలంగా పల్సూద్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ దగ్గర తాళాల దుకాణం నడుపుకుంటున్నాడు. అతడిని నడిరోడ్డు మీద పోలీసులు అవమానించారు. అతడి తలపాగాను అపవిత్రం చేశారు’ అని మండిపడ్డారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతోనే పోలీసులు తనపై దాడి చేశారని జియానీ ఆరోపించాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు