కన్నకూతురిని చిరుత ఈడ్చుకెళ్తుండగా.. తల్లి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్‌

12 May, 2022 19:53 IST|Sakshi

చంద్రాపూర్‌: చిరుత పులి (Leopard) ఎదురుపడితే.. పైప్రాణాలు పైనే పోవడం ఖాయం. అలాంటిది ఇక్కడ ఓ అమ్మ సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ధైర్యం తెచ్చుకుని చిరుతతో పోరాడింది. బిడ్డ కోసం వంట చేస్తుండగా.. గట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించింది ఓ చిరుత. అన్నం తింటున్న కూతుర్ని ఈడ్చుకెళ్తుంటాన్ని చూసి షాకైన ఆ తల్లి.. ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసింది.

జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితోపాటు మహారాష్ట్ర చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో కూతురు ఆకలి అనడంతో ఆ చిన్నారికి జ్యోతి అన్నం పెట్టి తన పనిలో నిమగ్నం అయింది. మూడేళ్ల చిన్నారి ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంట్లోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. కూతురి అరుపులు విన్న జ్యోతి.. చిన్నారి వద్దకు పరుగెత్తుకెళ్లింది. 

తన కూతురిని చిరుత ఈడ్చుకెళ్లడం చూసి షాకైంది. వెంటనే సమయస్ఫూర్తితో ఓ కర్ర తీసుకుని చిరుతను వెంబడించింది. ప్రాణాలకు తెగించి మరీ దానితో పోరాటం చేసింది. చివరకు కూతురి ప్రాణాలను రక్షించుకుంది. ఆ కర్ర దెబ్బలకు బిడ్డను వదిలేసిన చిరుత.. జ్యోతిని కూడా ఏం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ కూతురుని స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది జ్యోతి. ప్రస్తుతం ఆ బిడ్డ క్షేమంగానే ఉంది. చిరుతతో పోరాడిన ఊరంతా జ్యోతిని మెచ్చుకుంటున్నారు.

చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్‌!

మరిన్ని వార్తలు