నేనేం సోనియా రిమోట్‌ను కాను

8 Oct, 2022 06:17 IST|Sakshi

బీజేపీ ఆరోపణలపై ఖర్గే ఆగ్రహం

ప్రధాని.. బీజేపీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నిసార్లు పెట్టారని ఎదురుప్రశ్న

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్‌ కంట్రోల్‌ను కాదు. బీజేపీలోనే అలాంటి వ్యవస్థ ఉంది. కాంగ్రెస్‌లో సర్వామోదంతోనే అన్నీ జరుగుతాయి.

ఒకవేళ నేను పార్టీ పగ్గాలు చేపడితే నా రిమోట్‌ కంట్రోల్‌ నా వద్దే ఉంటుంది. కాంగ్రెస్‌లో పార్టీ కమిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్‌ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఉమ్మడి, సమష్టి నిర్ణయాలే అమలవుతాయి. రిమోట్‌ కంట్రోల్‌ భావన బీజేపీదే. మీలోని వాళ్లే ఇలాంటివి సృష్టిస్తారు’ అని బీజేపీ నేతలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీజేపీ అధ్యక్ష ఎన్నికలను ప్రధాని ఎన్నిసార్లు నిర్వహించారు? బీజేపీలో రిమోట్‌ కంట్రోల్‌ ఎక్కడుందో అందరికీ తెలుసు. మీరా మాకు హితబోధ చేసేది?’ అని ఎదురుదాడికి దిగారు. ‘చీఫ్‌గా ఎన్నికైతే పార్టీలో సగం సంస్థాగతమైన పదవులు 50 ఏళ్లలోపు వారికి దక్కేలా కృషిచేస్తా. మహిళలు, యువత, దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తా. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను పరిరక్షిస్తూ, పటేల్‌ ఐక్యతా పిలుపును బలపరుస్తా’ అని అన్నారు.

మరిన్ని వార్తలు