తృణమూల్‌ అధినేతగా మమత ఎన్నిక

3 Feb, 2022 05:35 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) అధినేతగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎన్నికయ్యారు. టీఎంసీ నాయకులు బుధవారం ఆమెను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీపై పోరాటానికి పార్టీ శ్రేణులంతా ఒక్క తాటిపైకి రావాలని ఈ సందర్భంగా మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత కలహాలను ఎంతమాత్రం సహించబోనని హెచ్చరించారు. టీఎంసీలో గ్రూపులు కడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలను మనమే గెలుచుకోవాలని, అందుకోసం ఇప్పటినుంచే కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దాం
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించడానికి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని మమతా బెనర్జీ సూచించారు. అందరం కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దామని అన్నారు. తాము బెంగాల్‌లో సీపీఎంను సులభంగా ఓడించామని, జాతీయ స్థాయిలో బీజేపీని సైతం ఇంటికి సాగనంపడం అసాధ్యమేమీ కాదని తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌గా మళ్లీ ఎన్నికైన అనంతరం ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకే వేదికపైకి రావాలని తాము కోరుకుంటున్నామని వెల్లడించారు.

ఎవరైనా అహం(ఈగో) కారణంగా వెనకే కూర్చుండిపోవాలని అనుకుంటే అది వారిష్టమని పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి చురక అంటించారు. అవసరమైతే తామే ఒంటిరిగా బీజేపీపై పోరాడుతామని చెప్పారు. మేఘాలయా, చండీగఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్‌ సాయం చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్, గుజరాత్‌ నుంచి బీజేపీ జాతీయ పార్టీలుగా ఎదిగినట్లుగానే పశ్చిమ బెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు