Tamil Nadu: ట్విటర్‌లో ఫిర్యాదుకు సీఎం స్పందన

17 May, 2021 07:02 IST|Sakshi
బాధితుడి వద్ద విచారం వ్యక్తం చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రజనీకాంత్‌

తిరువళ్లూరు: తిరువళ్లూరు లల్లా సెవ్వాపేట సిరుకడల్‌ ప్రాంతానికి చెందిన బాలకృష్ణన్‌(42)కు కొడుకు నితిష్‌కుమార్‌(09) ఉన్నాడు. మానసిక వికలాంగుడైన నితీష్‌కుమార్‌కు ప్రతి నెలా మందులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం బాలకృష్ణన్‌ తన బైక్‌లో సెవ్వాపేట నుంచి తిరువళ్లూరులోని మందుల దుకాణానికి వెళ్తుండగా కాకలూరు వద్ద తాలుకా పోలీసులు బైక్‌ ఆపి, హెల్మెట్‌ లేదన్న కారణంతో రూ.500 జరిమానా విధించారు. తన వద్ద డబ్బులు లేవని, తన కుమారుడి మందుల కొనుగోలు కోసమే వెళ్తున్నానని బతిమాలుకున్నా వినలేదు.

ఇంటికి తిరిగి వచ్చిన బాలకృష్ణన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో.. ‘పాలకులు మారినా పోలీసులు తీరు మారలేదు. నా కుమారుడి మందుల కోసం తీసుకెళ్లిన డబ్బును జరిమానా పేరిట లాక్కున్నారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ సీఎం స్టాలిన్‌ దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, డీజీపీ తదితరులు బాలకృష్ణన్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. జరిమానా పేరిట వసూలు చేసిన వ్యక్తులే మీ వద్దకు వచ్చిన సంబంధిత నగదు, మందులు ఇస్తారని తెలిపారు.

ఈ నేపథ్యంలో రాత్రి పది గంటలకు సెవ్వాపేటకు చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ రజనీకాంత్‌ రూ.500 నగదు, బాలుడికి నెలకు సరిపడా మందులను ఇచ్చి క్షమాపణలు కోరారు. ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదుకు ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించడంపై బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: ప్లాస్మా ఇస్తే పోలీసులకు సెలవు, నగదు పారితోషికం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు