రూ.3 కోట్ల ‘బెంట్లీ’ కారు గిఫ్ట్‌ ఇచ్చిన పేరెంట్స్‌.. రెచ్చిపోయి గాల్లోకి కాల్పులు.. వీడియో వైరల్‌

19 Oct, 2022 17:02 IST|Sakshi

చండీగఢ్‌: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్‌గా ఇ‍చ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్‌ ప్రాంతానికి చెందిన శుభమ్‌ రాజ్‌పుత్‌గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ ‍అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్‌ లైసెన్స్‌ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు.

వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. 

సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్‌ చేయటం క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్‌ గన్‌తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి.

ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు!

మరిన్ని వార్తలు