చెత్తగా తీసిన సినిమా అది.. బాలేదంతే!

11 Jun, 2022 12:20 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!


బాలేదంతే!

‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర బోల్తా పడినందున, రైట్‌–వింగ్‌ ద్వేషాన్నీ, ప్రచారాన్నీ ప్రేక్షకులు తిప్పికొట్టారని చాలా మంది అనాలోచిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది నిజం కాదు. ఇంకో అభిప్రాయం లేనంత చెత్తగా తీసిన సినిమా అది. అంతే!                               
– మణిముగ్ధ శర్మ, విద్యావేత్త 


ఎదుర్కోక తప్పదు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనను తాను ‘పీటర్‌ ద గ్రేట్‌’ (రష్యా చక్ర వర్తి)తో పోల్చుకుని, రష్యా తిరిగి తన భూభాగాలను పొందే తపనతో ఉందని చెబుతున్నారు. ఒక కథనం ప్రకారం, రష్యా ఆక్రమించుకున్న అత్యధిక ఉక్రెయినియన్‌ భూభాగా లను ‘రష్యన్‌ రీజియన్‌’గా ఏకం చేసే పథకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వడానికి ఇది సందర్భం కాకపోతే ఇంకేమిటి?
– ఒలెక్సీ సోరోకిన్, ఉక్రెయిన్‌ జర్నలిస్ట్‌


శాంతి శాంతి

ముస్లిం సమాజం శాంతియుతంగా ఉండాలని నా సలహా. దుందుడుకు చర్యలు దేశంలోని లౌకికవాదాన్ని బలహీనపర్చడానికే పనికొస్తాయి.
– యశ్వంత్‌ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి


వేరుగా మాట్లాడకూడదా?

టీకాల పట్ల అసమ్మతిపూరిత అభిప్రాయం ఉన్నవాళ్లను పర్యవేక్షించడానికీ, వారి మీద కేసులు వేయడానికీ ఇజ్రాయిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసిందని వార్త. పోలీసులు కాదు, అటార్నీ జనరల్‌ కాదు, స్వయంగా ఆరోగ్య మంత్రిత్వశాఖే రంగం లోకి దిగుతోంది. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్‌ డోసులను తప్పనిసరి చేసిన తెల్లారే ఇది జరుగుతోంది.                                                                    
– ఎలీ డేవిడ్, పరిశోధకుడు


మన ప్రేమ అందాలి

మొత్తం విశ్వం పట్ల పరోపకార బుద్ధితో ఉండట మనే భావనను గనక గట్టిగా పరిగణిస్తే, ఇంక శత్రువులు ఉండే అవకాశం ఎక్కడ? నిజంగా మానవాళి వాస్తవిక శత్రువులు ఏమంటే– కోపం, ద్వేషం లాంటి ప్రతికూల ఉద్వేగాలు. చెప్పాలంటే, ఈ భావనలు అధికంగా ఉన్నవాళ్ల పట్ల మనం మరింత కరుణతో వ్యవహరించాలి.
– దలైలామా, బౌద్ధ గురువు


ఆందోళనాపూరిత భవిష్యత్‌

కర్ణాటకలోని ఒక రోడ్డు మీద ఉరితీసిన ‘నూపుర్‌ శర్మ’ దిష్టిబొమ్మ వేలాడుతోంది. అధికారులకు నా అభ్యర్థన ఏమిటంటే, దయచేసి దాన్ని తొలగించొద్దు. ఇండియా మారిన బాధాకరమైన తీరుకు ఇంతకంటే ప్రతీకాత్మక చిత్రం ఇంకొకటి ఉండదు. ఇది మన భవిష్యత్తు, దాన్ని మనం ప్రదర్శించుకోవాలి.
– ఆనంద్‌ రంగనాథన్, రచయిత


తోసేస్తే సరి

మే నెలలో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. నలభై ఏళ్లలో అమెరికాలో ఇదే అత్యధికం. మే నెల కల్లా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతుందన్న ‘నిపుణులు’ తప్పని మరోసారి తేలింది. ఇంకేం? రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నిందిద్దాం.                       
– అఫ్‌షైన్‌ ఇమ్రానీ, కార్డియాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు