ఒక్క మాస్క్‌తో రూ.7.5 కోట్లు వసూళ్లు

16 Aug, 2021 17:53 IST|Sakshi

గురుగ్రామ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్‌ఫోన్‌ లేకున్నా పర్లేదు కానీ మాస్క్‌ మాత్రం తప్పనిసరి. మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అయితే కొందరు నిర్లక్ష్యంతో మాస్క్‌లు ధరించడం లేదు. వారి నిర్లక్ష్యం వారి కుటుంబంతో పాటు సమాజంలో మరికొందరికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మాస్క్‌ విధిగా ధరించాలనే నిబంధన అమల్లో ఉంది. ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాస్క్‌ ధరించకుండా ఉల్లంఘించిన వారికి బుద్ధి వచ్చేలా పలు వింత శిక్షలు విధించారు. అయితే తాజాగా గురుగ్రామ్‌ ఒక్క ఏడాదిన్నరలోనే రూ.ఏడున్నర కోట్ల ఆదాయం ఒక్క మాస్క్‌ ద్వారానే చేకూరింది.

కరోనా మొదటి దశ వ్యాప్తి నుంచి భౌతిక దూరంతో పాటు శానిటైజర్‌ వాడకం, మాస్క్‌ తప్పనిసరిగా ధరించడం మనం చేస్తున్నాం. అయితే కొందరి నష్టంతో రెండో దశ తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌ పట్టణంలో మాస్క్‌ లేని వారికి పెద్ద ఎత్తున జరిమానా విధించడం మొదలుపెట్టారు. గతేడాది జనవరి 23వ తేదీన మొదలుపెట్టిన జరిమానాలు ఇప్పటివరకు కొనసాగుతోంది. ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఈ ఏడాదిన్నర వ్యవధిలో మాస్క్‌ లేకుండా తిరిగిన వారు లక్షన్నర మందికిపైగా ఉన్నారని గురుగ్రామ్‌ పోలీస్‌ కమిషనర్‌ కేకే రావు తెలిపారు. మాస్క్‌ ధరించకపోవడంతో రూ.500 జరిమానా విధించారు. ఈ జరిమానాలతో ఏకంగా రూ.7.5 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఇంత ఆదాయం వచ్చిందంటే ఎంతలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

అధికారికంగా ఇంతమంది ప్రజలను గుర్తించామంటే తమకు తెలియకుండా ఎంతమంది మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారో అని పోలీసులు పేర్కొంటున్నారు. ఎంతమందికి అని జరిమానాలు వేస్తాం.. ప్రజలకు స్పృహ.. బాధ్యత అనేది ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క గురుగ్రామ్‌లోనే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే అర కోటి మందికి పైగా మాస్క్‌ లేకుండా తిరిగి ఉండవచ్చు అని నిఘా వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు విధిగా మాస్క్‌ ధరించాలని.. కరోనాను పారదోలేందుకు కృషి చేయాలని ప్రజలకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని వార్తలు