'మా మంత్రులకు హిందీ రాదు.. ఇంగ్లీష్‌ అంతంతే.. ఆయన్ను మార్చండి'

10 Nov, 2021 18:15 IST|Sakshi

ఐజ్వాల్‌: దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికి వచ్చిపడింది. విషయమేంటంటే.. సాధారణంగా మిజో ప్రజలకు, ఆయన క్యాబినెట్‌ మంత్రులకు హిందీ తెలియదు. మంత్రి వర్గంలో కొందరికి ఇంగ్లీష్‌ సమస్య కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మిజో ప్రజల స్థానిక భాషపై అవగాహన లేని సీనియర్‌ అధికారి రేణు శర్మను ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీగా నియమించారు. ఆయన ఏం చేయాలన్నా అన్ని ఇంగ్లీష్‌​ లేదా హిందీ భాషల్లోనే చేస్తున్నారు. అధికారులు కూడా ఇదే ఫాలో అవ్వాలని అంటున్నారు. ఇక్కడ అధికారుల వరకూ ఇబ్బంది లేదు కానీ మంత్రులకు భాషాపరమైన సమస్య తలెత్తింది. దీంతో ఏ పని ముందుకు సాగాలన్నా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జోరంతంగా కేంద్రానికి ఓ లేఖ రాశారు. 

చదవండి: (అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్‌ వేటు)

లేఖలో ఏముందంటే.. క్యాబినెట్‌ మంత్రులకు హిందీ తెలియదు, ఇంగ్లీష్‌ కూడా అంతంతమాత్రమే. కనుక మిజో భాషపై పరిజ్ఞానం ఉన్న ప్రధాన కార్యదర్శిని నియమించాలని మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా కేంద్రాన్ని కోరారు. స్థానికపై భాషపై పట్టున్న అధికారి అయితే ప్రభావవంతంగానూ, సమర్థవంతంగానూ ఉండగలరు అని పరిస్థితిని వివరించారు. కేంద్రంలో ఉండేది యూపీఏ ప్రభుత్వమైనా, ఎన్డీఏ ప్రభుత్వమైనా స్థానిక భాషపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులనే సీఎస్‌లుగా నియమిస్తున్నారు. మిజోరాం ఏర్పడి నుంచి ఇది ఆచారంగా వస్తోందని తెలియజేశారు. 

నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నాను. చాలా రాష్ట్రాలు ఒక కూటమి నుంచి మరో కూటమికి మారుతున్నప్పటికీ ఈశాన్య ప్రాంతంలో ఎన్డీయేకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్నది నేను మాత్రమే. కాబట్టి, ఎన్డీయేతో ఈ నమ్మకమైన స్మేహానికి నేను ప్రతేకం అని నమ్ముతున్నాను అంటూ లేఖలో రాశారు. తన అభ్యర్థనను ఆమోదించకుంటే ఎన్డీయేలో విశ్వాసపాత్రుడిగా పనిచేసినందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ తనను అపహాస్యం చేస్తుందని ముఖ్యమంత్రి జోరంతంగా లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు