Subrata Roy Death: సెబీ వద్ద వేల కోట్ల సహారా గ్రూప్‌ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!

20 Nov, 2023 13:29 IST|Sakshi

కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్‌(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్‌లో ఉన్న అన్‌క్లయిమ్డ్‌ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్‌కు (Consolidated Fund of India) ట్రాన్స్‌ఫర్‌ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది  

ది ఎకనామిక్ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్‌ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్‌లను సెబీకి (ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో) అప్లయ్‌ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. 

సెబీ నుంచి కేంద్ర బ్యాంక్‌ అకౌంట్‌కు 
ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్‌ అకౌంట్‌ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు.

అన్‌క్లయిమ్డ్‌ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే 
అయితే, సెబీ అకౌంట్‌ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కు నిధులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్‌ క్లయిమ్డ్‌ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం  వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్‌ చేసింది. 

వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి 
సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్‌ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది.

ప్రత్యేక పోర్టల్‌
నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్‌ సొసైటీలు అయిన సహారా క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, సహరాయణ్‌ యూనివర్సల్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, హమారా ఇండియా క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, స్టార్స్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లించనున్నారు. 

మరిన్ని వార్తలు