తక్కువ మార్కులొచ్చినా మెచ్చుకున్న తల్లి.. ఎందుకంటే..

28 Aug, 2023 13:00 IST|Sakshi

పిల్లలు పరీక్షల సమయంలోనూ, వాటి ఫలితాలు వచ్చే సమయంలోనూ తెగ ఆందోళన చెందుతుంటారు. మంచి మార్కులకు రాకపోతే తల్లిదండ్రులతో తన్నులు తప్పవని భావిస్తుంటారు. అలాగే తక్కువ మార్కులు వస్తే టీచర్లు తిడతారని ఆందోళన చెందుతుంటారు. మార్కులు ఎలా ఉన్నా విద్యార్థులు తమ ప్రోగ్రస్‌ రిపోర్టును తల్లిదండ్రులకు చూపించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొందరు విద్యార్థులు ప్రోగ్రస్‌ రిపోర్టులో మార్కులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు తమ ప్రోగ్రస్‌ రిపోర్టును నిజాయితీగా తల్లిదండ్రులకు చూపిస్తారు.

తాజాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం X (గతంలో ట్విట్టర్‌)లో వైరల్‌ అవుతోంది. దీనిని (@zaibannn) అనే పేరు కలిగిన అకౌంట్‌లో షేర్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘నా 6వ తరగతి పాత నోట్‌బుక్‌ దొరికింది. ఇది చూశాక నాకు స్కూలు రోజుల్లో మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం మరోమారు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు మా అమ్మ స్కోరు తక్కువ వచ్చిన ప్రతీ టెస్టులో పాజిటివ్‌ మెసేజ్‌ రాసేది’ అని రాశారు. 

ఆ పోస్టులోని వివరాల ప్రకారం ఆమె తల్లి మార్కులు రాసివున్న నోట్‌ బుక్‌లో సైన్‌ చేయడమే కాకుండా మెసేజ్‌ కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి ఫొటోలో ‘ఇలాంటి రిజల్టు రావడానికి ధైర్యం కావాలి’ అని రాశారు. రెండవ ఫొటోలోనూ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె తల్లి అలానే రాసింది. వీటిని కలిపి చూసినప్పుడు తల్లిదండ్రులంతా పిల్లలతో ఇలానే వ్యవహరించాలని, అప్పుడేవారు నిరాశ చెందకుండా, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని దీనిని పోస్టు చేసిన యూజర్‌ రాశారు.
ఇది కూడా చదవండి:  నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
 

మరిన్ని వార్తలు