కరోనా ఎఫెక్ట్‌: దయచేసి హోలి పండుగకు ఊరు రావొద్దు 

14 Mar, 2021 03:31 IST|Sakshi

ముంబైలోని బంధువులు, పిల్లలకు గ్రామస్తుల విజ్ఞప్తి 

కరోనా తీవ్రత దృష్ట్యా ఆంక్షలుండటంతో నిర్ణయం

సాక్షి, ముంబై: ఈ సారి హోలి పండుగకు ఊరికి రావొద్దని ముంబైలో ఉంటున్న తమవారికి గ్రామాల్లో ఉన్న బంధువులు ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనూ హోలి పండుగపై అధికారులు ఆంక్షలు విధించడంతో రావొద్దని కోరుతున్నారు.ఏటా ఎంతో ఘనంగా, ఆర్భాటంగా నిర్వహించే హోలి పండుగా ఈ సారి కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహించాలని అనేక గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేగాకుండా కలెక్టర్లు హోలి పండుగపై కొన్ని మార్గదర్శక సూచనలు జారీ చేశారు. అందులో పట్టణాల్లో ఉంటున్న తమ బంధువులను, పిల్లలను, ఇతర కుటుంబ సభ్యులను స్వగ్రామాలకు రావొద్దని చెప్పాలని పేర్కొన్నారు. అంతేగాకుండా పల్లెటూర్లలో జరుగుతున్న హోలి పండుగ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో, కేబుల్‌ నెట్‌వర్క్‌ లేదా వెబ్‌సైట్‌ తదితర మాధ్యమాల ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఒకవేళ బంధువులు వేడుకలకు రావాలనుకుంటే కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ చేతపట్టుకుని రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.  చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్‌ బంద్!‌)

రత్నగిరిలో వైభవంగా.. 
ఏటా స్వగ్రామంలో జరిగే హోలి పండుగకు హాజరయ్యేందుకు ముంబై, పుణే నుంచి పెద్ద సంఖ్యలో రత్నగిరి, సింధుదుర్గ్‌ తదితర జిల్లాలకు బయలుదేరుతారు. ఈ ఏడాది హోలి పండుగ ఈ నెల 29వ తేదీన ఉంది. దీంతో 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29 సోమవారం హోలి ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కూలీలు, ఇతర రంగాల కార్మికులు స్వగ్రామాలకు బయలు దేరేందుకు ఇప్పటి నుంచి సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వేషన్‌ చేసుకున్నారు.

కానీ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని హోలి పండుగకు స్వగ్రామాలకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ  హోలి పండుగ జరుపుకోవడం లేదని, మీరు రావద్దని ఫోన్‌లో చెబుతున్నారు. దీంతో ఏటా సొంత ఊళ్లలో కుటుంబ సభ్యుల మధ్య  జరుపుకోవల్సిన హోలీ పండుగను ఈ సారి ముంబైలోనే ఒంటరిగా లేదా మిత్రుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు వాపోతున్నారు. ఒకవేళ ఊరు వెళ్లాల్సి వస్తే కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని చెప్పడంతో అయోమయంలో పడిపోయారు.   

చదవండి: (సెకండ్‌ వేవ్‌ భయం.. లాక్‌డౌన్‌ దిశగా కర్ణాటక‌!?)

మరిన్ని వార్తలు