బుగ్గలు గిల్లడం నేరం కాదు: పోక్సో కోర్టు

5 Feb, 2021 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు

ముంబై: పోక్సో (‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎటువంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్‌ పిల్లల చెంపను తాకడం నేరం కాదని తెలిపింది. బుగ్గలు గిల్లుతూ 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న 28 ఏళ్ల టెక్నీషియన్‌ను మంగళవారం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

కేసు ఏంటంటే..
చిన్నారి తల్లి చెప్పిన దాని ప్రకారం.. ఫ్రిజ్‌ పనిచేయడం లేదనే కంప్లైంట్‌ మేరకు నిందితుడు 2017లో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి ఫ్రిజ్‌ని చెక్‌ చేసి.. అవసరమైన స్పేర్‌ పార్ట్స్‌ తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి బుగ్గలు గిల్లాడు. దీన్ని అభ్యంతరకరంగా భావించిన తల్లి అతడిని వారించి కిచెన్‌లోకి వెళ్లింది. ఇక ఆమె వంట గదిలో పనిలో ఉండగా.. టెక్నిషియన్‌ వచ్చి.. ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. భయంతో బిగుసుకుపోయిన సదరు మహిళ అతడిని పక్కకు తోసి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అతడు వదలలేదు. దాంతో ఆమె సూపర్‌వైజర్‌ని పిలిచింది. అతడు వచ్చి టెక్నిషియన్‌ని బటయకు గెంటే ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. 

దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సదరు టెక్నిషియన్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు టెక్నిషియన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అతడికి లైంగిక వేధింపుల నేరం కింద ఏడాది జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. అయితే చిన్నారిపై లైంగిక వేధింపులు ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. దురుద్దేశం లేకుండా చిన్నారి బుగ్గలు గిల్లడం నేరం కాదని వెల్లడించింది. "నిందితుడిపై ఆరోపణల నేపథ్యంలో సహేతుకమైన అనుమానాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌దే. ఇక చిన్నారి తల్లి సాక్ష్యాలను పరిశీలిస్తే, నిందితుడి బహిరంగ చర్యలు బాధితురాలిపై లైంగిక వేధింపులు, ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నిరూపించలేకపోతున్నాయి’’ అని కోర్టు అభిప్రాయపడింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కాక కొద్ది రోజుల క్రితం నాగ్‌పూర్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు
చదవండి: 
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్‌

మరిన్ని వార్తలు