​​​​​​​ముంబై: ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’.. దడ మొదలైంది!

16 Feb, 2021 12:56 IST|Sakshi

ముంబైలో 39 మంది నేరస్తుల అరెస్టు

నగరంలోని 951 చోట్ల పోలీసుల తనిఖీలు 

సాక్షి, ముంబై: ముంబై పోలీసులు ఆపరేషన్‌ ఆలౌట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 39 మంది నేరస్తులను ముంబై పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నగరంలోని అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 951 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబై పోలీసులు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’ పథకం సత్పలితాలనిస్తోంది. ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌లో స్థానికంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్‌ లేని ఆయుధాలతో తిరుగుతున్న నేరస్తులు కూడా ఇందులో పట్టుబడుతున్నారు. దీంతో కరుడుగట్టి నేరస్తులతోపాటు ఇళ్లల్లో దాక్కున్న సాధారణ నేరస్తుల్లో దడ మొదలైంది.  

ముంబై సీపీ నేతృత్వంలో.. 
శివ్‌ (శివాజీ) జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్‌ ఆలౌట్‌ చేపట్టారు. ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్, విశ్వాస్‌ నాంగరే–పాటిల్, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్ల మార్గదర్శనంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ జరిగింది. తమ తమ పోలీసుస్టేషన్ల హద్దులో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు 259 చోట్ల కూంబింగ్‌ నిర్వహించారు. అందులో పరారీలో ఉన్న 39 మంది నేరస్తులను పట్టుకోగా లైసెన్స్‌ లేకుండా అక్రమంగా ఆయుధాలతో తిరుగుతున్న 37 మందిపై, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నివాసముంటున్న వారిపై కూడా ఈ ఆపరేషన్‌లో చర్యలు తీసుకున్నారు. 

అందులో హోటళ్లు, ముసాఫిర్‌ ఖానా, లాడ్జింగులు, గెస్ట్‌ హౌస్‌లు తదితర అద్దె నివాస గృహాలలో 951 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్‌ ఆలౌట్‌లో భాగంగా రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్‌ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్‌ లక్ష్యమే. సిగ్నల్స్‌ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. 

ఇదిలాఉండగా ముంబై పోలీసులు ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో ఆపరేషన్‌ చేపట్టారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లేదా నగరాన్ని తిలకించేందుకు వచ్చి తప్పిపోయి తిరుగుతున్న లేదా ప్రేమలో మోసపోయి ఇంటికి వెళ్లలేక ఇక్కడే తిరుగుతున్న పిల్లలన్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో అనేక మంది పిల్లలు రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై లభించారు. వీరి చిరునామా సేకరించి ఇళ్లకు పంపించడంతో అనేక పేద కుటుంబాలు ఉపరి పీల్చుకున్నాయి. అంతేగాకుండా ఈ పథకం చేపట్టినందుకు ముంబై పోలీసులు వివిధ రంగాల నుంచి ప్రశంసలు అందుకున్నారు.   

చదవండి:
మరోసారి ఈ నగరాల్లో రాత్రి‌ కర్ఫ్యూ పొడిగింపు

ఉత్తరాఖండ్‌: మూడేళ్ల కొడుకును వదిలి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు