నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి

5 Nov, 2023 01:44 IST|Sakshi

వైరల్‌

‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్‌ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్‌’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్‌ అయ్యి పోలీసులను  మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు.

ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్‌ స్టేషన్‌ జా రహీ హూ... సుకున్‌ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్‌ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ పెట్టింది.

మనశ్శాంతిగా లేను అని  చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు.

‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్‌ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి.

‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్‌ చెయ్‌ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్‌బుక్‌లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు.

మరిన్ని వార్తలు