Madhya Pradesh: వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం

17 Dec, 2023 13:02 IST|Sakshi

మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా  తన స్వగ్రామమైన ఉజ్జయిని సందర్శించారు. నగరవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఒక​ విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా నేతలెవరూ రాత్రి వేళ ఉజ్జయినిలో బస చేయరు. దీనివెనుక వందల ఏళ్లుగా అనేక మూఢనమ్మకాలు స్థానికులలో నాటుకుపోయాయి. అయితే వీటన్నింటినీ కాదని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి గడిపారు.

ముఖ్యమంత్రి మోహన్ యాదవ్  ఉజ్జయినిలో రాత్రిపూట ఉండటం ద్వారా వందల సంవత్సరాల నాటి మూఢనమ్మకాన్ని బద్దలు కొట్టారు. ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లోని ఒక ధార్మిక నగరం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరం ఇక్కడే ఉంది. మహాకాళేశ్వరుడు ఉజ్జయినికి రాజు అని స్థానికులు నమ్ముతారు. మహాకాళేశ్వరుడు తప్ప మరే నాయకుడు లేదా మంత్రి ఇక్కడ రాత్రివేళ ఇక్కడ ఉండకూడదని చెబుతారు. ఈ నమ్మకాన్ని కాదని ఎవరైనా ప్రవర్తిసే వారికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని స్థానికులు అంటారు. నేటికీ ఉజ్జయినిలో ఏ నాయకుడు గానీ, మంత్రిగానీ బస చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. 

కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి బస చేయడం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అతను ఈ నగర నివాసి అని, పైగా మహాకాళీశ్వరుని భక్తుడైనందున అతను ఇక్కడ సాధారణ వ్యక్తిగా పరిగణలోకి వస్తారని స్థానిక పండితులు అంటున్నారు. ఈ నియమం నగరవాసులకు వర్తించదని, అందుకే ముఖ్యమంత్రి యాదవ్ తన స్వస్థలమైన ఉజ్జయినిలో ఎటువంటి సంకోచం లేకుండా రాత్రి బస చేయవచ్చని వారంటున్నారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయినికి రాజు మహాకాళీశ్వరుడు మాత్రమేనని, తాను అతని సేవకుడినని, తాను ఇక్కడ రాజుగా కాకుండా మహాకాళీశ్వరుని భక్తునిగా కొనసాగుతానన్నారు. 
ఇది కూడా చదవండి: సోలార్‌ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!

>
మరిన్ని వార్తలు