Mohan Yadav: ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..

14 Dec, 2023 13:39 IST|Sakshi

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్‌ సింగ్‌ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్‌కు  ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా  రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు.

మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్‌ యాదవ్‌ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్‌పురా, గోపాల్‌పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్‌ యాదవ్‌కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్‌ యాదవ్‌ కానుకలు ఇస్తుంటారు.

మధ్యప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఆనందీబెన్‌ కూడా మోహన్‌ యాదవ్‌కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో  ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్‌కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్  ఉన్నారు.
ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్‌ దాడుల్లో తేడా ఏమిటి?

>
మరిన్ని వార్తలు