బాంబే హైకోర్టుకు నవాబ్‌ మాలిక్‌ క్షమాపణ

11 Dec, 2021 05:42 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారి సమీర్‌ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్‌ మాలిక్‌ తరపు న్యాయవాది అస్పీ చినోయ్‌ కోర్టులో అఫిడవిట్‌ వేశారు.

నవంబర్‌ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్‌ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్‌ వివరించారు. మాలిక్‌ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్‌పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్‌ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

బెయిల్‌ నిబంధనలు మార్చండి: ఆర్యన్‌ ఖాన్‌ 
క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది.   

మరిన్ని వార్తలు