-

స్టూడెంట్ వీసాకు అమెరికా కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు

27 Nov, 2023 18:57 IST|Sakshi

ఢిల్లీ: భారతీయ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. ఎఫ్‌, ఎమ్‌, జే వీసా ప్రోగ్రామ్‌ల క్రింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. 

అధికారిక వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ క్రియేషన్‌, వీసా అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్ట్‌ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్‌పోర్ట్‌ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్‌ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. వారి అపాయింట్‌మెంట్లు రద్దు అవుతాయి. వీసా రుసుమును కూడా రద్దు చేస్తారు. 

ఎఫ్‌, ఎమ్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ ధ్రువీకరించిన స్కూల్‌ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ అవసరం అవుతుంది.

తప్పుడు పాస్‌పోర్ట్‌ నంబరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్‌మెంట్‌ కోసం బుక్‌ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.

పాత పాస్‌పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్‌పోర్ట్‌ తీసుకున్నవారు, కొత్తగా పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్‌మెంట్‌ను అంగీకరిస్తారు. 

ఇదీ చదవండి: అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు

మరిన్ని వార్తలు