-

అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు

27 Nov, 2023 16:38 IST|Sakshi

న్యూయార్క్: అమెరికాలో భారత రాయబారిని ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌లోని గురుద్వారాలో రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూని చుట్టుముట్టారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నుతున్నారని నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గురునానక్ జయంతి సందర్భంగా న్యూయార్క్‌ న్యూఐలాండ్‌లోని గురుద్వారాలో ప్రార్ధనల్లో పాల్గొని తరణ్‌జిత్ సింగ్ బయటకు వచ్చిన సందర్భంగా ఖలిస్థానీ మూకలు అడ్డుతగిలారు. ఈ ఘటనను బీజేపీ నాయకుడు మంజిందర్ సింగ్ తప్పుబట్టారు. ఇది సిక్కుల భావాజాలమా? గురునానక్ బోధనలు ఇదే చెబుతున్నాయా? ఈ ఖలిస్థానీ గుండాలు సిక్కులు కానేకాదని మంజిందర్ సింగ్ మండిపడ్డారు. 

కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించింది. ఆనాటి నుంచి కెనడా-భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.   

నిజ్జర్ హత్య కేసు తర్వాత భారత రాయబారులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్‌లో యూకేలోనూ భారత రాయబారి విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి ప్రవేశించకుండా దుండగులు అడ్డుకున్నారు. అయితే.. ప్రస్తుతం తరణ్‌జిత్ సింగ్‌ని ఖలిస్థానీ మద్దతుదారులు చుట్టుముట్టడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రాయబారుల భద్రత పట్ల అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.  

ఇదీ చదవండి:  భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’


 

మరిన్ని వార్తలు