ఉగ్ర దాడులకు ప్లాన్‌.. బెంగళూరులో ఎన్‌ఐఏ సోదాలు

13 Dec, 2023 10:25 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్‌ఐఏ పలుచోట్ల సోదాలు చేపట్టింది. రెండు రోజులు క్రితం.. 
మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్‌ మాడ్యూల్‌ నాయకుడితో సహా మొత్తం 15 మందిని  అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించినట్లు సంస్థ అధికార ప్రతినిధి  తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్‌ ఫోన్లు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

అయితే, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు