బాలయ్యా.. పిచ్చివేషాలు మానుకో..

29 Nov, 2023 08:47 IST|Sakshi
నిరసన తెలుపుతున్న మహిళలు

హిందూపురంలో మహిళల భారీ ర్యాలీ.. బాలకృష్ణ పోస్టర్‌ దహనం

హిందూపురం టౌన్‌: ‘బాలయ్యా.. పిచ్చి వేషాలు మానుకో... మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నీచంగా మాట్లాడడం వంటి పిచ్చివేషాలు వేస్తే మహిళలే నిన్ను తరిమికొట్టడం ఖాయం..’అని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణను వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక హెచ్చరించారు. మహిళలు, తోటి నటీమణుల పట్ల బాలకృష్ణ అసభ్యకరంగా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హిందూపురంలో మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు సాగిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాలకృష్ణ డౌన్‌ డౌన్‌.. బాలకృష్ణ గో బ్యాక్‌.. సైకో బాలకృష్ణ... అని నినాదాలు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ పోస్టరును చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అని చెప్పుకోవడానికి కూడా ఇక్కడి మహిళలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బాలకృష్ణ సంస్కారం లేకుండా తోటి సినీనటి విచిత్రతో ఎలా అసభ్యంగా ప్రవర్తించారో ఆమె నోటితోనే విన్నామని చెప్పారు. ఓ సినీ ఫంక్షన్‌లోనూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి సైకో ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ మాట్లాడుతూ హిందూపురం సమస్యలపై ఏ రోజూ అసెంబ్లీలో మాట్లాడని బాలకృష్ణ.. మహిళలపై మాత్రం నీచంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం రివాజుగా మార్చుకున్నాడని విమర్శించారు. మహిళలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
చదవండి: ఇదేమి పని ‘నారాయణా’ 

మరిన్ని వార్తలు