రాజకీయం చేయడానికిది సమయం కాదు... రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

3 Jun, 2023 21:32 IST|Sakshi

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు రాజకీయం చేయడానికిది సరైన సమయం కాదంటూ సున్నితంగా హెచ్చరించారు కేంద్ర మంత్రి.

రైల్వే శాఖ వైఫల్యం... 
ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వెనుక సాంకేతిక లోపమే ప్రధాన కారణమని, ఈ ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికి డౌన్ లేన్ లో వస్తున్న మరో రైలు బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలోనూ రైల్వే శాఖ విఫలమైందని విమర్శిస్తున్నాయి  ప్రతిపక్షాలు. ఈ కారణాలను ఎత్తిచూపుతూ కేంద్ర రైల్వే మంత్రి జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బాధ్యతగా రాజీనామా చెయ్... 
దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... గతంలోనూ ఒకేసారి ఇదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ప్రమాదం జరిగితే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

సమయం సందర్భం లేదా... 
రైల్వే మంత్రి స్పందిస్తూ... రైలు ప్రమాదంలో ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఇది వారి జీవితాలను పునరుద్ధరించాల్సిన సమయం. మేము పూర్తి పారదర్శకతతో ఆ పనుల్లో ఉన్నాము. రాజకీయం చేయడానికిది తగిన సమయం కాదని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
 

మరిన్ని వార్తలు