బీఆర్‌ఎస్‌కు కూచుకుళ్ల, కేఎస్‌ రత్నం రాజీనామా

27 Oct, 2023 04:21 IST|Sakshi
కేఎస్‌ రత్నం, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి

నేడు బీజేపీలోకి రత్నం, 31న కాంగ్రెస్‌లోకి దామోదర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌/కొల్లాపూర్‌/చేవెళ్ల: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరూ తమ రాజీనామా లేఖలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించారు. ఈనెల 31న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న ప్రియాంకాగాంధీ సభలో ఆమె సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సభాస్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవితో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ, స్థానికంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. సమస్యలను చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ను ఎన్నిసార్లు అపాయిట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదన్నారు.

మంత్రి కేటీఆర్‌కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తాను గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని 15 రోజులకోసారి కలిసి స్థానిక అంశాలు మాట్లాడేవాడినని వివరించారు. కేసీఆర్‌ పాలనలో అలాంటి అవకాశం లేదన్నారు. కాగా.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇది వరకే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం శుక్రవారం బీజేపీలో చేరనున్నారు.

పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా పారీ్టలో తగిన ప్రాధాన్యత లేకపోయినా కేసీఆర్‌పై ఉన్న గౌరవంతో కార్యకర్తగా కొనసాగానని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఆ తరువాత రెండుసార్లు తనకు టికెట్‌ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని.. చేవెళ్ల ప్రజల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు