ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్‌ చేయండి’

19 Feb, 2022 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్‌లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్‌ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్‌ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్‌ రివకరీ ఆఫ్‌ డ్యామేజెస్‌ టు పబ్లిక్, ప్రైవేట్‌ ప్రాపర్టీ యాక్ట్‌’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్‌ అరీఫ్‌ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. 

మరిన్ని వార్తలు