నూహ్‌లో ప్రశాంతంగా పూజలు

29 Aug, 2023 05:41 IST|Sakshi

నూహ్‌(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్‌ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్‌ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్‌ సరిహద్దుల నుంచి నూహ్‌ వరకు అయిదు ప్రధాన చెక్‌ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్‌ టోల్‌ ప్లాజా వద్ద నిలిపివేశారు.  అనంతరం అధికారులు నూహ్‌ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు.

అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.  శింగార్‌ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్‌ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు