Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..

15 Sep, 2023 13:30 IST|Sakshi

నూహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ అరెస్టు

ఆందోళనలు చెలరేగకుండా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్

48 గంటల పాటు 144 సెక్షన్‌ అమలు

చండీగఢ్‌: నూహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను గురువారం అరెస్టు చేశారు పోలీసులు. మమ్మన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో జిల్లాలో ఆందోళనలు చెలరేగకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. బిగ్ ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవలను కూడా బంద్ చేసింది. 48 గంటల పాటు ఈ నిలుపుదల ఉత్తర్వులు అమలులో ఉండనున్నాయి. జిల్లాలో 144 సెక్షన్‌ను కూడా ప్రభుత్వం విధించింది. శుక్రవారం జరగాల్సిన ప్రార్థనలు కూడా ఇంటి నుంచే చేసుకోవాలని ప్రజలను కోరింది. 

సెప్టెంబర్ 15 ఉదయం 10:00 గంటల నుంచి సప్టెంబర్ 16 రాత్రి 11:59 వరకు జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదల సహా 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ టీ వీ ఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ చెప్పారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని కోరారు. ఆందోళనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 

జులై 31న నూహ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు.  ఈ కేసులో ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు. 

తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని మమ్మన్‌ ఖాన్ ఆరోపిస్తున్నారు. అల్లర్లు జరిగిన రోజు తాను జిల్లాలో లేనని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అన్నారు. అల్లర్లలో మమ్మన్‌ఖాన్ నిందితుడిగా ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోన్ కాల్స్‌తో సహా పలు కీలక ఆధారాలున్నాయని వెల్లడించారు. 

నూహ్ అల్లర్ల కేసులో దర్యాప్తు బృందాల ముందు హాజరు కావాలని ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌కు ఇప్పటికే రెండు సార్లు సమన్లు అందాయి. కానీ వైరల్ జ్వరం కారణంగా చూపుతూ ఆయన హాజరు కాలేదు. గురువారం అరెస్టు చేయగా.. శుక్రవారం న్యాయస్థానం ముందు ఆయన్ను హాజరు పరచనున్నారు. 

ఇదీ చదవండి: అది మాకు తెలుసు.. లాయర్‌ లూథ్రాతో సుప్రీం ధర్మాసనం


 

మరిన్ని వార్తలు