డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు

23 Nov, 2023 12:58 IST|Sakshi

  క్రియేటర్లు, ప్లాట్‌ఫారంలపై కఠిన చర్యలు

 త్వరలోనే నిబంధనల ముసాయిదా

ముప్పుగా పరిణమిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు

న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్‌ ఫేక్‌ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు  సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్‌ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది.

డీప్‌ఫేక్‌ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిర్వహించిన  సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. అనంతరం అశ్విన్‌ వైష్ణవ్‌  మీడియాతో  మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి,  వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా  కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి  నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు.  

అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్‌లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో  డీప్‌ఫేక్‌ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. (ఐఆర్‌సీటీసీ డౌన్‌: మండిపడుతున్న వినియోగదారులు )

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్బా నృత్యం చేస్తున్నట్టు వచ్చిన నకిలీ వీడియోతోపాటు,  సినీ హీరోయిన్లు రష్మికా మందాన, కాజోల్  పేరుతో కొన్ని అభ్యంతర  వీడియోలు నెట్టింట హల్‌  చేసిన నేపథ్యంలో ఐటీ శాఖ  కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.


 

మరిన్ని వార్తలు