బీహార్‌లో హైటెన్షన్‌.. ఒకరు మృతి, 80 మంది అరెస్ట్‌

2 Apr, 2023 11:59 IST|Sakshi

పాట్నా:  శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో రాజుకున్న ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నలంద జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు 80 మందిని అరెస్ట్‌ చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఇక, అల్లర్ల కారణంగా బీహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన రద్దు అయ్యింది. 

వివరాల ప్రకారం.. బీహార్‌లోని ససారంలో శనివారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్‌లోని ఓ గుడిసెలో  బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. 

మరోవైపు, నలందాలోని బీహార్‌షరీఫ్‌లో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పహర్‌పూర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముఖేష్ కుమార్ అనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగడంతో నలందాలో 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇక, ఆదివారం కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్‌ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో అమిత్‌ షా పర్యటన రద్దయ్యింది. 

మరిన్ని వార్తలు