అయ్యో.. అవ్వా, అన్నేళ్ల కష్టమంతా పోయిందే!

19 Oct, 2022 11:34 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టింది ఆ వృద్ధురాలు. నా అన్నవారు ఎవరూ లేకపోయినా దాచుకున్న సొమ్ముతో కులాసాగా బతకాలని అనుకుంది. తీరా అవసరం కోసం దాచుకున్న డబ్బును బయటకు తీయగా చెదలు పట్టడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కెరడ పంచాయతీ ఖిలిమిసి గుడ గ్రామానికి చెందిన సామంత సదే అనే వృద్ధురాలికి ఎవరూ లేరు.

కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. వచ్చే కూలి డబ్బులను కొంతమేర అవసరాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును ఒక ట్రంకు పెట్టెలో దాచి ఉంచింది. ఇలా సుమారు రూ.40 వేలకు పైగా దాచుకున్న డబ్బు అవసరం కోసం తెరవగా, డబ్బుకు చెదలు పట్టి పనికిరాకుండా పోయినట్లు గుర్తించింది. కొన్ని నోట్లు తడిచిపోవడంతో పాటు మరికొన్ని పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. దీంతో కష్టమంతా వృథా అయ్యిందని కన్నీటిపర్యంతమైంది. కొన్ని నోట్లు తడిచి ఉండడంతో ఎండలో ఆరబెట్టింది.

చదవండి: డాక్టర్‌ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్‌!

మరిన్ని వార్తలు