Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి

14 Dec, 2023 09:40 IST|Sakshi

ఢిల్లీ: నూతన పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు . అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో, ఈ ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

అయితే, ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్‌ తండ్రి దేవరాజ్‌ పార్లమెంట్‌ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాజాగా దేవరాజ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్‌ చేశారు. తన కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు. ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలని కామెంట్స్‌ చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని అన్నారు. 

నిందితుల వివరాలు ఇలా.. 
లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్‌, అమోల్ షిండే, నీలం దేవి కౌర్‌, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు పోలీసులు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్‌. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్‌.

అయితే వీరందరూ భగత్‌సింగ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నట్టు గుర్తించారు.  పక్కా ప్లాన్‌ ప్రకారమే పార్లమెంట్‌లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్‌లతోనే పార్లమెంట్‌లోకి వచ్చినట్టు వివరించారు. మరోవైపు.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌లో నీలం దేవి కౌర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. ఇక, వీరంతా లలిత్ ఝా ఇంట్లోనే బస చేసినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

>
మరిన్ని వార్తలు