Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు

19 Dec, 2023 04:44 IST|Sakshi
భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి వివరణకు డిమాండ్‌ చేస్తూ సోమవారం లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విపక్ష ఎంపీలు

భద్రతా వైఫల్యంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన

లోక్‌సభ, రాజ్యసభలో నినాదాలు, నిరసనల హోరు 

హోం మంత్రి అమిత్‌ షా వివరణకు, రాజీనామాకు డిమాండ్‌ 

లోక్‌సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెన్షన్‌

వారిలో 14 మందిపై సభా హక్కుల కమిటీ విచారణకు ఆదేశాలు

అప్పటిదాకా పార్లమెంటు నుంచి బహిష్కరణ

మిగతా వారిపై సెషన్‌ ముగిసేదాకా వేటు.. ఈ సెషన్లో మొత్తం 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌

పార్లమెంట్‌లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్‌సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్‌ వేటు పడటం తెలిసిందే.

దీంతో ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరణ, రాజీనామాకు డిమాండ్‌ చేయడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్‌ చేసిందని మండిపడ్డారు.  
 
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్‌లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో  తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ ప్రకటించారు.

లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత వారమే లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది.

వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరణ, రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్‌ చేసిందని మండిపడ్డారు.

లోక్‌సభలో విపక్షాల రగడ  
భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్‌సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్‌ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్‌ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది.

దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, 8 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉన్నారు. స్పీకర్‌ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్‌ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
 
రాజ్యసభలో అదే దృశ్యం  

రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్‌ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్‌ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే.

ప్రస్తుత సెషన్‌ ముగిసేదాకా సస్పెండైన లోక్‌సభ సభ్యులు
అదీర్‌ రంజన్‌ చౌదరి, గౌరవ్‌ గొగొయ్, కె.సురేశ్, అమర్‌సింగ్, రాజమోహన్‌ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్‌);  కల్యాణ్‌ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్‌ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్‌ దస్తీదార్, అసిత్‌ కుమార్‌ మాల్, సునీల్‌ కుమార్‌ మండల్‌ (తృణమూల్‌ కాంగ్రెస్‌); టీఆర్‌ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్‌కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్‌.అన్నాదురై, ఎస్‌.ఎస్‌.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్‌.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్‌ బషీర్‌ (ఐయూఎంఎల్‌); ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్పీ); కౌసలేంద్ర కుమార్‌ జేడీ(యూ)

సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు:
కె.జయకుమార్, విజయ్‌ వసంత్, అబ్దుల్‌ ఖలీక్‌ (కాంగ్రెస్‌)

ప్రస్తుత సెషన్‌ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు
ప్రమోద్‌ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్‌భాయ్‌ జె.రాథ్వా, సయీద్‌ నాసిర్‌ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్‌ గోహిల్, రజని అశోక్‌రావు పాటిల్, రంజీత్‌ రంజన్, ఇమ్రాన్‌ ప్రతాప్‌గార్హీ (కాంగ్రెస్‌); సుఖేందు శేఖర్‌ రాయ్, మొహమ్మద్‌ నదీముల్‌ హక్, అబిర్‌ రంజన్‌ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్‌ నూర్, ప్రకాశ్‌ చిక్‌ బరాయిక్, సమీరుల్‌ ఇస్లాం (తృణమూల్‌ కాంగ్రెస్‌); ఎం.షణ్ముగలింగం, ఎన్‌.ఆర్‌.ఇలాంగో, కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము, ఆర్‌.గిరిరాజన్‌ (డీఎంకే); మనోజ్‌ కమార్‌ ఝా, ఫయాజ్‌ అహ్మద్‌ (ఆర్జేడీ), రామ్‌గోపాల్‌ యాదవ్, జావెద్‌ అలీఖాన్‌ (ఎస్పీ); రామ్‌నాథ్‌ ఠాకూర్, అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్‌ (సీపీఎం); వందనా చవాన్‌ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్‌ కె.మణి (కేసీ–ఎం); అజిత్‌కుమార్‌ భూయాన్‌ (స్వతంత్ర)

సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు:
జెబీ మాథర్‌ హిషామ్, ఎల్‌.హనుమంతయ్య, నీరజ్‌ డాంగీ, రాజమణి పటేల్, కుమార్‌ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్‌ (కాంగ్రెస్‌); జాన్‌ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్‌ విశ్వం, పి.సందోష్‌కుమార్‌ (సీపీఐ); మొహమ్మద్‌ అబ్దుల్లా (డీఎంకే)  

నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్‌ చేశారు.
– అధీర్‌ రంజన్‌ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత  

లోక్‌సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహాను సస్పెండ్‌ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్‌ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం.
– సౌగతా రాయ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత  

పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్‌ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం.                       
– టీఆర్‌ బాలు, డీఎంకే నేత 

>
మరిన్ని వార్తలు