Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు అందని ఆహ్వానం.. ట్రస్ట్‌ ఏమందంటే..

19 Dec, 2023 08:11 IST|Sakshi

ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్‌ తరఫున ముగ్గురు సభ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది కూడా. అయితే బీజేపీ కురువృద్ధులు లాల్‌ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్‌ జోషిలకు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వాళ్లలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరికీ ఆహ్వానాలు వెళ్లకపోవడం ఏంటనే అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు. మరోవైపు రాజకీయంగా బీజేపీపై ఈ విషయంలో విమర్శలు వినిపించాయి. దీంతో రామ టెంపుల్‌ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌ రాయ్‌ స్పందించారు. 

రామ మందిర ప్రారంభోత్సవ విషయం వాళ్లకు తెలియజేశామని.. అయితే వృద్ధాప్యం, వాళ్లకు ఉన్న ఆరోగ్య సమస్యల రిత్యా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక రావొద్దని చెప్పామని అన్నారాయన. అందుకు వాళ్లిద్దరూ, వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు చంపత్‌ రాయ్‌ మీడియాకు తెలియజేశారు. అద్వానీ వయసు 96 ఏళ్లుకాగా, జోషి వయసు 90. 


జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. 

జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్‌ రాయ్‌ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు