నలుగురు మృతి..రిలీఫ్‌ క్యాంపులకు 7 వేల మంది

19 Dec, 2023 07:21 IST|Sakshi

చెన్నై:భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలం అవుతోంది.  కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి, తూత్తుకుడి  జిల్లాల్లో  జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. 

నాలుగు జిల్లాల్లో 7500 మందిని ఇప్పటికే రిలీఫ్‌ క్యాంపులకు తరలించారు.  సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆర్మీ సహాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలో కాయల్‌పట్టిణం ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.  రహదారులన్నీ జలమయమయ్యాయి.చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే రైళ్ళను రద్దు చేశారు. 

కొమొరిన్‌ ప్రాంతంలో కేంద్రీకృతమైన తుపాను పొరుగు ప్రాంతాలకూ విస్తరిస్తోందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.  

భారీ వర్షాల కారణంగా కన్యాకుమారి, టెన్‌కాశి రెండు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వం మంగళవారం(డిసెంబర్‌ 19) కూడా సెలవు ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా వేశారు. 

తిరునల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో మొన్నటిదాకా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. 

ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్‌, ప్రియాంక పోటీ?

>
మరిన్ని వార్తలు