ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్‌ టాయిలెట్‌లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’

5 Jun, 2023 10:44 IST|Sakshi

‘అప్పుడు నేను పడుకున్నాను. ఇంతలో రైలు పట్టాలు తప్పింది. నాపైన 10 మంది ప్రయాణికులు పడిపోయారు. ఎలాగోలా లేచి కోచ్‌ బయటకు వచ్చేశాను. అక్కడ మనుషుల తెగిపడిన శరీర భాగాలు కనిపించాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి’ రైలు ప్రమాద బాధితుడు మొహమ్మద్‌ అకీబ్‌ ఆవేదనతో మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇవి.  

కాగా కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సంజయ్‌ ముఖియా ప్రమాదం జరిగిన సమయంలో టాయిలెట్‌లో ఉన్నారు.  ప్రమాదం నుంచి బయట పడిన సంజయ్‌ ముఖియా మీడియాతో మాట్లాడుతూ ‘టాయిలెట్‌లో ఉన్న నాకు పెద్ద పెద్ధ శబ్ధాలు వినిపించాయి. కుదుపులు కూడా వచ్చాయి. మేముంటున్న బోగీ పక్కకు పడిపోతున్నట్లు అనిపించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డాను’ అని తెలిపారు. సంజయ్‌ ముఖియా బీహార్‌లో కూలిపనులు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తుంటాడు.

ప్రమాద బాధితుడు అనుభవ్‌ దాస్‌ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని తెలియజేశారు. ‘నేను పట్టాలపై 200 నుంచి 250 వరకూ మృతదేహాలు పడివుండటాన్ని చూశాను. ఈ హృదయవిదారక దృశ్యాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఇది అత్యంత భారీ  రైలు ప్రమాదం’ అని దానిలో పేర్కొన్నారు.  ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్‌ 2) జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మరణించారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోరం చోటుచేసుకుంది.

చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...

మరిన్ని వార్తలు