కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

10 Nov, 2023 05:32 IST|Sakshi
వాహనం మీది నుంచి కిందకు జారుతున్న మంత్రి కేటీఆర్‌ (వృత్తంలో)

డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌.. విరిగిన ప్రచారరథం రెయిలింగ్‌ 

వాహనం పైనుంచి కిందికి జారిన మంత్రి 

కింద పడిన రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి 

ఆర్మూర్‌/సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్‌ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్‌ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్‌ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది.

ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్‌ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయగా వాహనం రెయిలింగ్‌ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్‌ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్‌ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్‌ కొడంగల్‌ రోడ్‌ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు.  

నాకేమీ కాలేదు: కేటీఆర్‌ 
ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ ‘ఎక్స్‌’(ట్విట్టర్‌)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు