Maharashtra: ఓబీసీ రిజర్వేషన్‌ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..

16 Dec, 2021 14:28 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భండారా– గోండియా జిల్లా పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో భండారా జిల్లాల్లోని ఓ గ్రామంలో వినూత్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. దయచేసి ఓట్లు అడిగేందుకు రావద్దని గ్రామస్తులు తమ ఇంటి ముందు బోర్డులు పెట్టారు. ఓబీసీ రిజర్వేషన్‌ రద్దు కావడంతో నిరసనగానే వారు ఇలా బోర్డులు ఉంచారని తెలిసింది. ఓబీసీ రిజర్వేషన్‌ రద్దు కావడంతో ఓబీసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భండారా తాలూకాలోని పిపరీ గ్రామంలోని ఓబీసీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ గ్రామంలో నివసించే ప్రజలలో అత్యధికంగా ఓబీసీ కేటగిరివారే ఉన్నారు. దీంతో వీరందరూ డిసెంబర్‌ 21వ తేదీన జరగబోయే జిల్లా పరిషత్‌ ఎన్నికల కోసం దయచేసి ఎవరూ ఓటు అడిగేందుకు రావద్దని బోర్డులను తమ ఇళ్ల ముందు అమర్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డులు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

చదవండి: (ఓటర్‌ ఐడీతో ఆధార్‌ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌)

>
మరిన్ని వార్తలు