భారత్‌ మాకెప్పుడూ మిత్ర దేశమే

9 Oct, 2020 09:37 IST|Sakshi

ఆఫ్ఘన్‌ శాంతి చర్చల నేత

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ

అజిత్‌ దోవల్‌తోనూ సుదీర్ఘ చర్చలు

న్యూఢిల్లీ: ఆఫ్గనిస్తాన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్న హై కౌన్సిల్‌ ఫర్‌ నేషనల్‌ రీకన్సీలియేషన్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ ఛైర్మన్‌ అబ్దుల్లా అబ్దుల్లా.. నరేంద్ర మోదీని కలిసి, యుద్ధంతో చిన్నాభిన్నమైన తమ దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి జరుగుతున్న కృషిని వివరించారు. మనోహర్‌ పారికర్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలసిస్‌లో జరిగిన సమావేశంలో అబ్దుల్లా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియ కొనసాగడానికి భారత దేశం సహాయం కొనసాగిస్తుందని మోదీ హామీ ఇచ్చినట్లు అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఆఫ్గనిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మోడీ కట్టుబడి ఉన్నారని విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ శ్రీవాస్తవ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియకి మద్దతు కూడగట్టడానికి ఐదు రోజుల పర్యటనకు అబ్దుల్లా భారత దేశం వచ్చారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో అబ్దుల్లా సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్‌ ఎప్పటికీ తమకు మిత్రదేశమేనని అబ్దుల్లా అన్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా యుద్ధం తరువాత కూడా దేశంలో అంతర్గత సంఘర్షణల విషయంలో సైనిక పరిష్కారానికి తావులేదని అబ్దుల్లా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌ పునర్‌నిర్మాణం కోసం భారత దేశం పదిహేను వేల కోట్ల సాయాన్ని అందించింది. ఇటీవల తాలిబన్లతో అమెరికా చేసుకున్న శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉంది. 2001 సంవత్సరం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటి వరకు అమెరికా 2400 మంది సైనికులను కోల్పోయింది. ప్రజల ఆకాంక్షలను గౌరవించడానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి రావాలని ఇండియా ఆకాంక్షిస్తూ ఉంది. (చదవండి: తైవాన్‌ ప్రకటన; చైనాకు భారత్‌ కౌంటర్‌!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు