PK: ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారా..?

15 Jul, 2021 04:04 IST|Sakshi

కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ

సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం పెరిగిన ఊహాగానాలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌లో ఆయన చేరడంపై ఊహాగానాలు పెరిగాయి. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆ లోపు రానున్న పలు అసెంబ్లీల ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్దమవుతున్న పరిస్థితుల్లో.. పార్టీలో ప్రశాంత్‌ కిషోర్‌ పోషించాల్సిన కీలక పాత్రపై సోనియా, రాహుల్, ప్రియాంకలతో  భేటీ సందర్భంగా చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. సోనియా, రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడం ఇదే మొదటిసారి కాదని వెల్లడించాయి.

రాహుల్‌ గాంధీ నివాసంలో మంగళవారం జరిగిన భేటీ అందరూ అనుకున్నట్లు పంజాబ్, లేదా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాల గురించి కాదని.. అంతకు మించిన అంశంపై వారి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించిపెట్టే బృహత్తర బాధ్యతను ప్రశాంత్‌ కిషోర్‌పై పెట్టాలని సోనియా భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు ప్రశాంత్‌ కిషోర్‌ విజయం సాధించిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు చేస్తున్న పనిని కొనసాగించాలని అనుకోవట్లేదు. ఇప్పటివరకు చేసింది చాలు. విరామం తీసుకుని, కొత్తదేదైనా చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా’ అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన స్పష్టం చేశారు.

మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఒక విఫల రాజకీయవేత్తను. ముందుగా, నేనేం చేయగలను అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ కాంగ్రెస్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ కలిసి పని చేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో కిషోర్‌ వ్యూహాల సాయంతోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే, ఆ తరువాత పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రశాంత్‌కిషోర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ 100 ఏళ్ల వయస్సున్న రాజకీయ పార్టీ. ఆ పార్టీ  పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రశాంత్‌ కిషోర్‌ వంటి వ్యక్తుల నుంచి సలహాలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉండరు. నా పనితీరు వారికి సరిపడదు’ అని గతంలో వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు