టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం 

9 Nov, 2023 03:22 IST|Sakshi

పురుగు మందు తాగిన బాన్సువాడ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి 

ఐసీయూలో చికిత్స పొందుతున్న కాసుల బాల్‌రాజ్‌ 

బాన్సువాడ: కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌..బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్‌ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్‌ కోసం బాల్‌రాజ్‌ విశ్వప్రయత్నాలు చేశారు.

అయితే అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది. దీంతో బాల్‌రాజ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం బాన్సు వాడలో తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పా టు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014 నుంచి పార్టీని నమ్ముకుని కార్యకర్తలను కా పాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చివరకు తనను కాదని, వేరే ప్రాంతం వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం ఏమిటంటూ కన్నీరు పెట్టుకున్నారు.  

ఆమరణ దీక్షకు దిగి ఇంతలోనే.. 
కాంగ్రెస్‌ అధిష్టానం మరోమారు టికెట్‌ విషయంలో పునరాలోచించాలని కోరుతూ బుధవారం ఉదయం బాల్‌రాజ్‌ తన ఇంటి ముందు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో తనతో పాటు దీక్షలో కుర్చున్న కార్యకర్తలను భోజనం చేయండంటూ ఇంట్లోకి పంపించారు. తాను బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చారు. వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కార్యకర్తలు కంగారు పడిపోయారు. కొందరు బాత్‌రూం లోపలకి వెళ్లి చూశారు.

మోనో–65 పురుగుల మందు డబ్బా కనిపించడంతో బాల్‌రాజ్‌ను హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. బీఆర్‌ఎస్‌కు చెందిన డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, బీజేపీ బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని బాల్‌రాజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు