-

Tamil Nadu: అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే

28 Nov, 2023 13:39 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. 

ఈ మేరకు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్‌ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. 
చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు

ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్‌ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది.

కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్‌ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది.

అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు