లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈడీ అధికారి.. దర్యాప్తు సంస్థలపై పోలీసులు దాడులు

2 Dec, 2023 09:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో లంచం తీసుకుంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్​కు(ఈడీ) చెందిన అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈడీ  సీనియర్‌ అధికారి అంకిత్‌ తివారీ లంచం తీసుకుంటూ రాష్ట్ర పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దిండిగుల్‌ జిల్లాలో ఓ వైద్యుడి వద్ద రూ.20 లక్షల లంచం స్వీకరిస్తున్న అతడిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ వెల్లడించింది. కారులో ప్రయాణిస్తున్న అంకిత్‌ తివారీని దుండిగల్‌ పోలీసుల సాయంతో ఓ టోల్‌గేట్‌ వద్ద ఆపి అరెస్టు చేసినట్టు పేర్కొంది.

అరెస్ట్​ అనంతరం మధురై జిల్లా ఈడీ కార్యాలయంపై, అంకిత్​ తివారీ ఇంట్లో దిండిగుల్​ జిల్లా విజిలెన్స్​ అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ అధికారులు దాడులు చేపట్టారు. శుక్రవారం రాత్రి నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ భద్రత నడుమ అధికారులు ఈడీ ఆఫీసులో తనిఖీ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రివేళ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఆఫీసును తమిళనాడు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో వారు గేటు బయటే ఉండిపోయారు.

దిండిగుల్​లో ఓ ప్రభుత్వ వైద్యుడి ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అంకిత్​ రూ. కోటి లంచం డిమాండ్​ చేసినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా రూ. 20 లక్షలను వైద్యుడు స్థానిక జాతీయ రహదారి పక్కన ఇస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్​ ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మద్రాస్​ హైకోర్టులో ఈ కేసు విచారణకు రావడంతో విషయం వెలుగు చూసింది. అంకిత్​ తివారీకి డిసెంబర్​ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది న్యాయస్థానం.

ఈ కేసు దర్యాప్తులో మధురై, చెన్నైకి చెందిన మరికొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.. అంకిత్ తివారీ ఇప్పటి వరకు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతను ఇతర ఈడీ అధికారులకు కూడా లంచాలను పంపిణీ చేస్తున్నాడని పేర్కొన్నారు. మరోవైపు అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతోంది.

అయితే తమిళనాడులో భారీగా లంచం తీసుకున్న కేసులో ఓ ఈడీ అధికారి అరెస్ట్​ కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి మనీలాండరింగ్‌ కేసుల్లో కొందరు డీఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. 

మరిన్ని వార్తలు