Uttarkashi Tunnel: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్‌ సంస్థ

29 Nov, 2023 07:41 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనిలో హైదరాబాద్‌కు చెందిన బోరోలెక్స్‌ ఇండ్రస్ట్రీస్‌ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు. 

టన్నెల్‌లో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్‌ చేసే విషయమై సలహా అందించాలని వారు డాక్టర్ సతీష్ రెడ్డిని కోరారు. ఈ నేపధ్యంలో ఆయన ఇందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. ఈ తరుణంలో బెరోలెక్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి  ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను సూచించారు. తరువాత 800 ఎం.ఎం. పైపులైన్ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించాడు. ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. 

ఆ యంత్రాలను, ఇద్దరు కట్టింగ్ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సంఘటనా స్థలానికి తరలించింది. వారు నవంబరు 25న బేగంపేట విమానాశ్రయం నుండి డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి వెళ్లారు. కొద్ది గంటల సమయంలోనే టన్నెల్‌లో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్‌లను కట్‌ చేసే పని మొదలు పెట్టారు. తద్వారా ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్‌కు అనువైన పరిస్థితులు కల్పించారు.  ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భాస్కర్ కుల్బే తదితరులు టన్నెల్‌ సహాయక చర్యల్లో చేయూతనందించిన బెరోలెక్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.  
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 41 మంది సురక్షితం

మరిన్ని వార్తలు