బిహార్‌ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!

26 Oct, 2020 18:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ అసెంబ్లీకి మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబర్‌ 28వ తేదీన మొదటి విడత పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 3, ఏడవ తేదీల పోలింగ్‌తో ఈ ఎన్నికలు ముగుస్తాయి. నవంబర్‌ పదవ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 2005 నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న జేడీయూ నాయకుడు నితీష్‌ కుమార్‌కు ఈసారి ప్రజా వ్యతిరేకత పెరిగింది. మద్య నిషేధ చట్టం (బిహార్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ చట్టం –2016)ను ప్ర‌వేశ పెట్ట‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకొస్తున్న స్మగ్లర్లకన్నా మద్యం సేవించిన వారిని, మద్యం కలిగి ఉన్న ప్రజలను అరెస్ట్‌ చేయడం పట్ల ప్ర‌జ‌లు తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి 2020, ఆగస్టు నెల వరకు 1580 రోజుల్లో రోజుకు సగటున 190 మంది చొప్పున 3,06 ,000లక్షల మంది మద్యం ప్రియులను రాష్ట్రంలో అరెస్ట్‌ చేశారు. వారిలో 66, 657 మంది ఎక్సైజ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. (లాలూకి బెయిల్‌.. నితీష్‌కు ఫేర్‌వల్‌‌ )

మద్య నిషేధ చట్టం కింద అరెస్టయిన 3,06 లక్షల మందిలో 90 శాతం మంది దళితులు, మహా దళితులే ఉన్నారు. రాష్ట్రంలోకి ఏరులై పారుతున్న అక్రమ మద్యాన్ని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్న బిహార్‌ అధికారులు అన్యాయంగా వాటిని మూడింతలు ఎక్కువ ధరలకు మ‌ద్యం కొంటున్న వినియోగ దారులను అరెస్ట్‌ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా పాశవికమైన ఈ మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఆరేజేడీ, మూడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ కూటమిగా పోటీ చేస్తోంది. నితీష్‌ కుమార్‌ జేడీయూతో కలసి బీజేపీ పోటీ చేస్తోంది. మద్యం ప్రియులు బాహాటంగా నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ మ‌ద్య‌పానాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని నితీష్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. (ఉల్లి ధరలపై వినూత్న నిరసన )

మరిన్ని వార్తలు