ప్రశాంత్‌ కిశోర్‌ చేరికపై రాహుల్‌ చర్చలు!

30 Jul, 2021 04:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి ఏమేరకు ప్రయోజనం ఉంటుంది? ఎదురయ్యే ప్రతికూలతలు ఏమిటని రాహుల్‌ గాంధీ సీనియర్‌ నేతలతో చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు గురువారం తెలిపాయి. ఈనెల 22న రాహుల్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్లు ఏ.కె.ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, కమల్‌నాథ్, అంబికా సోని, హరీష్‌ రావత్, కె.సి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది. ప్రశాంత్‌ కిశోర్‌ చేరికతో ఉండే సానుకూలత, ప్రతికూలతలను ఇందులో రాహుల్‌ పార్టీ నేతలతో కూలంకషంగా చర్చించారు.

పార్టీలో చేరితే ప్రశాంత్‌ కిశోర్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశం కూడా చర్చకు వచ్చింది. ప్రశాంత్‌ చేరితే కాంగ్రెస్‌ పార్టీకి ప్రయో జనం కలుగుతుందని సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రశాంత్‌ కిశోర్‌ ఈనెల 13న రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యా రు. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహగానాలు వెలువడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ, ప్రశాంత్‌ కిశోర్‌లు మాత్రం ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. బెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి మమత హ్యాట్రిక్‌లో కీలకభూమిక పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌ తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు